సెక్యులరిజం ఒక వింత !

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం ద్వారా ప్రధాని మోదీ ఈ దేశంలో పాటిస్తున్న సెక్యులర్‌ ‌విలువల్ని, రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ కొందరు విమర్శలు చేశారు. దీనితో ‘సెక్యులరిజం గురించిన చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.

నిజానికి ‘సెక్యులరిజం పాశ్చాత్య భావన, విధానం. పాశ్చాత్య దేశాల్లో మతంపై గుత్యాధిపత్యం కలిగిన చర్చి, రాజ్యంపై అధికారం కలిగిన రాజుకు మధ్య ఘర్షణను నివారించడం కోసం వాళ్ళు అనుసరించిన రాజీ మార్గమే సెక్యులరిజం. మతం రాజ్యాధికారాల్లో కలిగించు కోకూడదు, రాజు మత విషయాలు పట్టించుకో కూడదన్నది ఆ ఒప్పందం. కానీ ఈ పాశ్చాత్య ఆ విధానాన్ని ఎప్పుడూ మతం, రాజ్యం మధ్య ఎలాంటి ఘర్షణ, పొరపొచ్చాలు లేని మన దేశంపై రుద్దాలని చేసిన దురుద్దేశపూరిత ప్రయత్నం వల్ల అనేక సమస్యలు పుట్టుకువచ్చాయి. సెక్యులరిజం, సోషలిజం అనే పదాల్ని ఎమర్జెన్సీ సమయంలో దొడ్డిదారిన రాజ్యాంగంలో చొప్పించారు. చివరికి సెక్యులరిజం అంటే సనాతన హిందూ సంస్కృతి, సభ్యతలను వ్యతిరేకించడం, మైనారిటీ మతాల్ని నెత్తిన పెట్టుకోవడంగా మార్చేశారు.

నిజానికి సెక్యులరిజం అంటే రాజ్యం దృష్టిలో అన్ని మతాలకు సమాన హోదా ఇవ్వడం. అలా జరిగితే అప్పుడు మెజారిటీ, మైనారిటీ విభజనకు అవకాశం ఉండదు, ఉండకూడదు. అలాకాకుండా మైనారిటీలకు ప్రాధాన్యతనివ్వాల్సిందేనని వాదిస్తే అప్పుడు సెక్యులరిజానికి(అన్ని మతాలకు సమాన ప్రాతిపదిక)వీలుండదు. ఈ దేశం మెజారిటీ వర్గానిదేనని అంగీకరించాల్సి ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటంటే అటు రాజ్యం సెక్యులరిజానికి కట్టుబడి ఉందంటూనే మరోపక్క మైనారిటీల (కేవలం ముస్లిముల) సంతుష్టీకరణకు పాల్పడు తున్నారు. అంటే ఒకపక్క  మైనారిటీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలనడం ద్వారా ఈ దేశం మెజారిటీ వర్గానిదేనని పరోక్షంగా అంగీకరిస్తూనే, మరోపక్క మెజారిటీ వర్గపు హక్కుల్ని అదే సెక్యులరిజం పేరుతో కాలరాస్తున్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత గుజరాత్‌లోని గజనీ ధ్వంసం చేసిన సోమనాధ మందిరాన్ని పునరుద్ధరించాలని అప్పటి హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌తోసహా అనేకమంది భావించారు. గాంధీజీ కూడా ఈ ఆలోచనను సమర్థించారు. అయితే మందిర నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును ఉపయోగించ కుండా ప్రజల నుంచే విరాళాలు సేకరించాలని సూచించారు. ఆ ప్రకారమే ప్రణాళిక సిద్ధమైంది. కానీ దేశ సెక్యులర్‌ ‌విలువలు మంటగలిసి పోతాయంటూ అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. మందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రాజేందప్రసాద్‌ ‌హాజరు కావడానికి వీలులేదని అభ్యంతరం తెలిపారు కూడా. కానీ ప్రధాని, రాష్ట్రపతి నివాసాల్లో  ముస్లింలకు ఇఫ్తార్‌ ‌విందులు ఇచ్చే సంప్రదాయం అదే నెహ్రూ హయాంలో ప్రారంభమైంది. అలాంటి విషయాలకు వర్తించని సెక్యులరిజం, అయోధ్య రామమందిరానికి వచ్చేసరికి ఎలా మంటగలిసిపోతుందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.