శ్రీ‌కృష్ణ జన్మాష్టమి

చేతవెన్నముద్ద చెంగల్వపూదండ

బంగారు మొలతాడు పట్టుదట్టి

సందె తావీదులు సరిమువ్వగజ్జెలు

చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు

దేవకీ-వసుదేవులకు దేవకి అష్టమి గర్భంగా శ్రావణమాసం, కృష్ణపక్షం, అష్టమి తిథినాడు చెరసాలలో జన్మించాడు శ్రీకృష్ణుడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారత యుద్దాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి. మహాభారతం, భాగవతం కథలను విన్నా, దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడిన విలువలు ఎన్నో బోదపడుతాయి. ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణ భగవానుడు నేటి కలియుగంలో కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న ఆయా ప్రాంతాల సంప్రదాయాలు భారతీయ సంస్కృతికి విలక్షణమైన సౌందర్యాన్ని కలుగజేస్తున్నాయి.

శ్రీకృష్ణ జన్మాష్టమిని, గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పురవీధులలో ఎత్తుగా ఉట్టు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని ఉంచి భక్తి పారవశ్యంతో కీర్తనలు ఆలపిస్తారు. భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణ జయంతి ఆచరిస్తే కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. మధురలో బాలకృష్ణునిగా, పూరీలో జగనాథునిగా, మహారాష్ట్రలో విఠోభాగా, ఉడుపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయూరప్పగా కృష్ణుని పూజిస్తారు.

శ్రీకృష్ణుడు చిలిపి బాలునిగాను, గోపాలకుడు గాను, రాధా, గోపికా మనోహరునిగాను, రుక్మిణి సత్య భామాధి అష్ట విదుషీమణుల ప్రభువుగాను అర్జునుని సారధిగాను, ధర్మపక్షపాతిగాను, గీతాచార్యుడుగాను, చారిత్రిక రాజనీతిజ్ఞుడుగా సనాతన భారతీయ సంప్రదాయం నిత్య స్మర ణీయుడు.